Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు నో.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ అడ్డంకులు!

Supreme Court dismisses AP government petition on 34 percent BC reservations
Advertisement
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిరాకరణ
  • ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు
  • హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం
  • 34 శాతం రిజర్వేషన్లకు ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులోనూ అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయపరమైన అడ్డంకులు కొనసాగుతున్నాయి. గతంలో ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రస్తుతానికి అడ్డంకి ఏర్పడింది. ఈ రిజర్వేషన్లను అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతాయని హైకోర్టు గతంలో పేర్కొంది. ఆ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. 

వెనకబడిన తరగతులకు తగిన ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 20న గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి జీవో 105 జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆగస్టు 19న మరో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాలపై న్యాయస్థానాల్లో సవాళ్లు ఎదురయ్యాయి. 2020లోనూ 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు సాధారణంగా 50 శాతం మించకూడదు. అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలంటే వెనుకబాటుతనంపై సమగ్ర అధ్యయనం, విశ్వసనీయ గణాంకాలు అవసరమని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు తాజా నిర్ణయం రాష్ట్రంలో రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Advertisement
Andhra Pradesh Government
Supreme Court
BC Reservations
Local Body Elections
AP High Court
Reservation Cap

More Telugu News